Monday, February 9, 2009

ఇవాల్టి కథ

- డా పాపినేని శివశంకర్‌
తెలుగు కథ వస్తువులో, రూపంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కథల్లో విస్తరణ తగ్గింది. మిక్కిలి తక్కువ కాన్వాస్‌లో ఎక్కువ విషయం చెప్పటానికి రచయితలు ప్రయత్నిస్తున్నారు. సరికొత్త వస్తువులు అరుదుగానైనా కథల్లో వచ్చాయి.తెలుగు కథా రచయిత లెక్కలేనన్ని చిక్కుముళ్ళ మధ్య చిక్కుకుపోయినట్టు కనిపిస్తుంది నాకు. ఉత్తమ కథా రహస్యం ఏమిటి? ఏ విధమైన శిల్ప మార్గం ఎన్నుకోవాలి? ఇవి మొదటగా ఎదురయ్యే ప్రశ్నలు. జీవితం ఎందుకింత చిందరవందరగా, సంతలో తొక్కిసలాటగా ఉంది? దీనివెనక సూత్రం ఏమిటి? అనేవి తర్వాత కలిగే సందేహాలు. వస్తు సంపదే జీవన సంపదగా మారిన సందర్భం. సుఖ సాధనాలే శాంతిదాయకాలుగా భ్రమిస్తున్న సందర్భం. ఎడతెగని పరుగు పందెం. రుచి లేని, అభిరుచి లేని సం„స్కృతీ సంబంధం లేని నిత్య జీవితం . పరంపర మధ్య అభద్రత. పరాయితనం, డొల్లతనం, వ్యక్తిత్వ విచ్ఛిన్నత. మానవసంబంధాల విచ్ఛిన్నత. మనిషి సమూహం నుంచి తెగిపోతున్న వైనం. ఇంకా వెలుపలికి చూస్తే సామాజిక వ్యత్యాసాలు. అవినీతి. విలువల విధ్వంసం. మొత్తం మీద ఆధునిక జీవితంలో పూడ్చలేని ఒక వెలితి. ఈ వెలితికి కారణాలు వెతకటం, దాన్ని పూడ్చుకునే మార్గం అన్వేషించటం ఇప్పటి కథా రచయిత పని.

సమాజం చెయ్యలేని ఈ అన్వేషణ రచయితే చెయ్యాలి. సమాజంలో విద్యా వైద్య సౌకర్యాలు పెరిగాయి. ఉత్పత్తి పెరిగింది. సంపద పెరిగింది. శాస్త్ర జ్ఞానం పెరిగింది. సుఖ సాధనాలు పెరిగాయి. అంత మేరకి మనిషి ఆనందం కూడా పెరగాలి కదా? ఆందోళన తప్ప ఆనందం ఎందుకు పెరగడం లేదు? బహుశా మనం ప్రేమిస్తున్న `ఆధునికత'లోనే ఏదో తెలీని లోపం ఉంది. ఆధునికతని ఈ నేలతనంతో సరిగ్గా ముడిపెట్టుకోలేకపోయామా? నేల విడిచి సాము చేస్తున్నామా? ఇప్పటికీ వలసవాదం నిర్దేశించే జీవన విధానమే ఆధునికతగా భ్రమిస్తున్నామా? ఇక్కడి మౌలిక జీవన విధానాన్ని, సంస్కృతిని విధ్వంసం చెయ్యటంలోనే మన అశాంతికి కారణం ఉందా? సమాజం, అందులో శకలంగా మనిషి ఇరుక్కున్న ఈ పద్మవ్యూహాన్ని ఛేదించేదెట్లా? రచయిత తేల్చుకోవాలి.

1990 ప్రాంతాల నుంచి సమాజంలో ఆర్థిక సరళీకరణ విధానాలు మొదలయ్యాయి. ప్రైవేటీకరణ మొదలైంది. పెద్ద పెద్ద పరిశ్రమలు మూతపడ్డాయి. వ్యవసాయం కుంటుపడింది. ఉత్పత్తులకు ధరలు తగ్గటం, ఎరువులు, మందుల ధరలు పెరగటం మొదలైన పరిణామాల మధ్య వ్యవసాయం జూదానికి పర్యాయపదమైంది. రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రపంచీకరణ విశ్వరూపంతో భారతదేశానికి వెన్నెముక అయిన గ్రామ జీవితం విచ్ఛిన్నమైంది. కులవృత్తులు విధ్వంసమయ్యాయి. ఇక విద్యారంగంలో మానవీయ, సామాజిక శాసా్తల్ర యుగం అంతమై సాంకేతిక నైపుణ్య యుగం ప్రారంభమైంది. విద్యార్ధులకు జ్ఞానం కంటే కెరీర్‌ ప్రధానంగా మారింది. నైపుణ్యం గల యువకుల అమెరికా వలస వేగవంతమైంది. డాలర్‌ నోటు ప్రపంచాన్ని చుట్ట చుట్టింది. ప్రపంచ బ్యాంకు, అగ్రదేశాల కనుసన్నల్లో మెలుగుతున్న మన ప్రభుత్వాలకు ప్రజా జీవన సమస్యలు ఏమంత పట్టలేదు.

వీటన్నిటిలో ప్రత్యేకంగా చెప్పదగింది సాంస్కృతిక విధ్వంసం. తెలుగు భాష, తెలుగు సంస్కృతి, ఆచార వ్యవహారాలు అనే వాటికి ఇప్పటి జీవితంలో ఏ మాత్రం స్థానం ఉంది? అంత తేలిగ్గా మన మూలాలను ఎట్లా మరచిపోగలిగాం? మనం మర్చిపోయిన భారతీయ ఆత్మని ఎక్కడ మళ్ళీ గుర్తించగలం? తెగిపోతున్న మానవ సంబంధాలను మళ్ళీ ఎట్లా అతుక్కోగలం? ఇవన్నీ నేటి రచయితలకు ఎదురవుతున్న ప్రశ్నలు. వీటికి సమాధానాలు వెతికే ప్రయత్నంలో ఉన్నాడు తెలుగు కథా రచయిత. ఈ సంధి దశలో కథా రచనలో వైవిధ్యం పెరిగింది. చుట్టు పక్కల ఉద్యమాలను, వాదాలను రచయిత అందిపుచ్చుకున్నాడు. ముఖ్యంగా స్త్రీవాదం, స్త్రీవిముక్తి అనే అంశాల మీద 1990వ దశాబ్దంలో ఎన్నో కథలు వచ్చాయి. స్త్రీ పురుషుల అసమానతలోని ఆర్థిక, కౌటుంబిక, ప్రేమ సంబంధాలకు పరీక్షకు పెట్టాయి. ఈ పరిశీలన అటు కవిత్వంలోను, ఇటు కథలలోనూ విస్తృతంగా సాగింది. చాలా మంది రచయిత్రులు ఎంతో సంయమనంతో కథల్లో ఈ పరిశీలన చెయ్యగలిగారు. దళితవాదానికి కవిత్వంలో ఉన్నంత ఊపు, ఉద్రేకం కథల్లో లేదు. కారణం తెలీదుగాని, కవిత్వంతో పోల్చుకుంటే సంఖ్యారీత్యా చాలా తక్కువ దళిత కథలు కనబడతాయి.

అయితే వ్యక్తమైనంతవరకు తెలుగు కథలో దళితవాదం ఒక తీవ్ర కంఠస్వరమే. అలాగే వెనుకబడిన కులాల నుంచి గొప్ప చైతన్యం ఈ మధ్యకాలంలో గమనించవచ్చు. కుల వృత్తుల సంక్షోభాన్ని సమర్ధంగా చిత్రించారు రచయితలు. కథా సాహిత్యంలో మరో పెద్ద కెరటం ముస్లిం వాదం. ఇప్పటిదాకా తక్కిన సమాజానికి తెలియని ఎన్నో జీవిత కోణాలని ముస్లిం రచయితలు ముందుకు తెచ్చి చూపించారు. అస్తిత్వవాదం ముందుకు వచ్చిన నేపథ్యంలో రాయలసీమ నుంచి 1990 దశాబ్దం నుంచి విలువైన కథలు వచ్చాయి. ఒక తరం నుంచి మరో తరం కథను అందిపుచ్చుకుంటున్న తీరు అక్కడ గమనించవచ్చు. ఇక తెలంగాణ ప్రాంతీయ చైతన్యం నుంచి విరివిగా ప్రత్యేక కంఠస్వరంతో వెలువడుతున్నాయి కథలు. తక్కిన ప్రాంతాలకు తీసిపోకుండా ఉత్తరాంధ్ర తన ఉనికిని నిరూపించుకుంటున్నది. ఎటొచ్చీ తీరాంధ్ర ప్రాంతం నుంచి కథారచన కొంత మందగించింది. అయితే పరిస్థితి అంత నిరాశాపూరితంగా మాత్రం లేదని చెప్పగలను.

విమర్శకులు కొంతమంది ప్రస్తుత కథా సాహిత్యం మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అందులో ప్రధానమైంది, గాఢమైన ముద్ర వేసే ఉత్తమ కథలు అంతగా రావటం లేదనేది. అందులో వాస్తవం ఉంది. జీవిత శకలాన్ని మొత్తంలో ఒక భాగంగా కాకుండా విడిగా చూసినప్పుడు అసమగ్రత ఏర్పడుతుంది. తాత్కాలికాన్ని (టాపికల్‌) శాశ్వతంతో (ఎటర్నల్‌) ముడిపెట్టి చూసినప్పుడే ఒక రచన ఉన్నతీకరించబడుతుంది. అందుకు తాత్విక పరిశీలన అవసరం. తత్వ జిజ్ఞాస లేని రచయిత ఉత్తమ రచయిత కాలేడు. వస్తువులో కన్పించే ఔన్నత్యం శిల్పంలో కనిపించటం లేదనేది మరో విమర్శ. రచయితలు తొందరగా తమ ఆలోచనని కాగితం మీద పెట్టే దారిలో తిరిగి చూసుకోవటం లేదు.

అనవసరమైన విషయాన్ని ఎడిట్‌ చేసుకోవడం లేదు. నిజాయితీ ఉన్నంత మాత్రాన ఒక కథ గొప్ప కథ కానేరదు. ఏ విషయం ఏ అభివ్యక్తిని ఎన్నుకుంటుంది అనేది ముఖ్యంగా రచయితలు పరిశీలించాలి. రకరకాల శిల్ప మార్గాల్ని అన్వేషించాలి. అందుకు ప్రపంచ సాహిత్యంలో `క్లాసిక్‌‌ల్' అనదగిన కథలు చదవాలి. ఆ అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. దురదృష్టవశాత్తు చాలామంది రచయితలకి ఆ ఓపిక, తీరిక లేవు. గొప్పవాళ్ళ కథలు చదివితే ఆ ప్రభావం తన మీద పడుతుందనే ఒక సాకు చూపిస్తారు కొంతమంది రచయితలు. ఉత్తమ కథా పఠనం మన రచనా నైపుణ్యాన్ని తప్పకుండా పెంచుతుంది.
ఇప్పటి సమాజంలో స్త్రీలపై - మరీ ముఖ్యంగా విద్యార్ధినుల మీద - జరుగుతున్న అత్యాచారాలు నిజంగా హేయమైనవి. బలాత్కారాలు, బలవంతపు ప్రేమలు, యాసిడ్‌ దాడులు, హత్యలు, ఆత్మహత్యలు- ఇటువంటి దుర్మార్గ సంఘటనల మధ్య రోజులు గడుస్తున్నాయి. యువతీ యువకుల్లోని అరాచక ప్రవృత్తికి ఇవి నిదర్శనాలు. ఇప్పటి మన జీవితంలోకి పాశ్చాత్యీకరణ ప్రవేశం ఇందుకొక కారణమైతే, నీచమైన అభిరుచుల్ని ప్రోత్సహిస్తున్న తెలుగు సినిమాలు మరో ప్రధాన కారణం. మరోవంక ఉగ్రవాద బీభత్సం మన సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నది.

లుంబినీవనం దగ్గర్నుంచి ముంబయి తాజ్‌మహల్‌ దాకా ఎన్నెన్నో దుస్సంఘటనలు చూస్తున్నాం. ఇటువంటి సంఘటనలకి కవిత్వం స్పందించినంత త్వరగా కథ స్పందించడం లేదని విమర్శకులు అంటున్నారు. ఇది వాస్తవమే. అయితే ఏ విషయానికైనా కవిత్వపు స్పందన వేరు; కథా స్పందన వేరు. కేవలం ఒక ఆవేశకెరటంపై తేలిపోతూ కవిత అల్లవచ్చు. తీవ్రమైన అనుభూతి లేదా సహానుభూతి ప్రకటించవచ్చు. కథకి అది చాలదు. సన్నివేశాలు, వ్యక్తులు కావాలి. కావాలంటే వాటిలో అంతో యింతో స్వీయ పరిచయం ఉండాలి. లేదా ఆయా సంఘటనలకు సంబంధించిన అనుభవం ఉండాలి. ఇవేవీ లేకుండా కథ అల్లటం కుదరదు. ఒకవేళ అల్లినా అది కృత్రిమంగా ఉంటుంది. కనుకనే ఇరాక్‌ పై అమెరికా దౌర్జన్యం మీద సద్దాం హుస్సేన్‌ మీద వందల కవితలు వచ్చాయి. కథలు రాలేదు. రాలేవు. కేవలం పరోక్ష జ్ఞానం కథా నిర్మాణానికి చాలదు.

సుమారుగా ఈ పదేళ్ళలో తెలుగు కథ వస్తువులో, రూపంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కథల్లో విస్తరణ తగ్గింది. మిక్కిలి తక్కువ కాన్వాస్‌లో ఎక్కువ విషయం చెప్పటానికి రచయితలు ప్రయత్నిస్తున్నారు. సరికొత్త వస్తువులు అరుదుగానైనా కథల్లో వచ్చాయి. `గేటెడ్‌ కమ్యూనిటీ' గురించి అక్కిరాజు భట్టిప్రోలు రాస్తే బౌద్ధ `జాతక కథ'ని వర్తమాన సమాజ గమనంతో ముడిపెట్టి పరిశీలించాడు అజయ్‌ప్రసాద్‌. అప్పల్నాయుడు క్షతగాత్ర భూమిగానం చేశాడు. ప్రాచీన `మృణ్మయనాదం' పలికించింది ఓల్గా. `దుత్తలో చందమామ' చూపించాడు గోపిని కరుణాకర్‌. గ్రామీణుల వలస గాథని విన్పించాడు పెద్దింటి అశోక్‌ కుమార్‌. కృష్ణ, గుంటూరు, తీరాంధ్ర మధ్యతరగతి స్త్రీల జీవితంలో మార్పుల్ని `పెళ్ళి ప్రయాణం'లో చిత్రించింది పి. సత్యవతి.

మారిన వ్యవసాయ జీవన సంక్షోభాన్ని కాట్రగడ్డ దయానంద్‌, మంచికంటి వంటి రచయితలు వివరించారు. పర్యావరణ విధ్వంసం నేపథ్యంలో మురళి ఊదే పాపడిని చూపించాడు దాదా హయాత్‌. కంసాలి కుటుంబాల చీకటి వేదనని సుంకోజు దేవేంద్రాచారి పలికించాడు. ఎవరూ చూపని `ప్రళయ కావేరి'ని స్వభావోక్తిలో చూపించాడు స.వెం.రమేష్‌. కార్పొరేట్‌ సంస్కృతిలో లైంగిక సుఖ సాధనాలుగా ఉపయోగపడే సరికొత్త `సాలభంజిక'ల్ని ప్రదర్శించింది కుప్పిలి పద్మ. మీడియా లోకంలో అనుభూతులు ఆవిరైపోయి `రాతి తయారీ' గురించి రాశాడు ముని సురేష్‌ పిళై. సంచార తెగల జీవన పోరాటాన్ని చిత్రించాడు, వి.ఆర్‌.రాసాని. అదృశ్యమవుతున్న `చివరి పిచ్చిక'ని, ఆవిరైపోతున్న జ్ఞాన సముద్రాన్ని చూపించాడు పాపినేని. ప్రపంచీకరణ `మాయ లాంతరు' వెలుగులో ఆవుల్ని వేటాడే పులుల్ని చూపించాడు, వి.చంద్రశేఖరరావు. అస్తిత్వపు `లోయ చివరి రహస్యం' విప్పి చెప్పాడు భగవంతం. ఇవి ఈ కాలపు వైవిధ్యభరితమైన కథల్లో కొన్ని మాత్రమే.

మార్క్సిస్టు కోణం నుంచే గాకుండా అస్తిత్వ వాదం, ఆధునికానంతర వాదం మొదలైనవి కూడా తెలుగు కథలోకి వచ్చాయి. మాంత్రిక వాస్తవికత, చైతన్య స్రవంతి, మాంటేజ్‌ ప్రక్రియలాంటి శిల్ప పద్ధతులు, అభివ్యక్తి విధానాలు కథల్లో చూపిస్తున్నారు రచయితలు. పి.సత్యవతి, వి.చంద్రశేఖరరావు, జాన్సన్‌ చోరగుడి, భగవంతం, గోపిని కరుణాకర్‌, రమణ జీవి, కాశీభట్ల వేణుగోపాల్‌, అజయ్‌ప్రసాద్‌, సురేష్‌ మొదలైనవాళ్ళ కథల్లో ఈ కొత్త కొత్త పద్ధతులు చూడవచ్చు. స్థాయీ భేదాలు పక్కనపెడితే ప్రస్తుతం విరివిగా రాస్తున్న వాళ్ళు సుమారు ఏభైమంది కథా రచయితలు కనపడతారు. అప్పుడప్పుడు రాస్తున్న వాళ్ళను కలుపుకుంటే వందమంది కథా రచయితల్ని తేలిగ్గా గుర్తించగలం. మంచి కథల్ని సంకలనాలుగా అందిస్తే ఎంతగానో ఉపయోగపడతాయి. కథా సాహితి, కథా వార్షిక, కథా స్రవంతి, తెలంగాణా కథ ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది పనిగట్టుకొని ఈ సంకలనాల మీద దాడి ప్రారంభించారు (రచయితలుగా వీళ్ళు `మెనోపాజ్‌' దశకు చేరుకున్న తర్వాతనే ఈ విమర్శలు చెయ్యటం గమనించదగినది). సంకలనాలు వెయ్యటమంటే కొద్ది మంది రచయితల్ని బతికించటం కోసం చాలామంది రచయితల్ని హత్యచెయ్యటమేనని ఒకానొక విమర్శకుడన్నాడు. ఇంతకన్న సాహిత్య మూర్ఖత మరిలేదు. ఏడాదిలో వచ్చే వేల కథల్లో మేలైనవి కొన్ని ఒకచోట లభించటం చాలా ఉపయోగకరం అని ఎంత తెలివితక్కువ వాడికైనా అర్థమవుతుంది. అయితే సంపాదకుల అభిరుచులు, ఆలోచనలు కథల ఎన్నికలో తప్పనిసరి పాత్ర వహిస్తాయి. పూర్తి `ఆబ్జెక్టివిటీ' అనేది ఎక్కడా సాధ్యం కాదు. కథల్లో హాస్య వ్యంగ్యాలు మరీ నల్లపూసలైపోయాయి. నిజానికి సీరియస్‌ విషయాల్నీ హాస్యంతో, వ్యంగ్యంతో మెరిపించటం చాలాకష్టం.వెనకటికి పానుగంటి, ముళ్ళపూడి వంటి గొప్ప రచయితలు, అయోధ్య శ్రీరమణ, తోలేటి వంటివాళ్ళు ఈ విద్యలో ఆరితేరి, మనల్ని మురిపించారు. ప్రస్తుతం బిగువైన, సున్నితమైన హాస్యస్ఫూర్తితో కథా రచన చేసేవాళ్ళు కనిపించటం లేదు. నిరాశ పనికి రాదు గనక ముందు ముందు ఎదురుచూద్దాం.


వందేళ్ళలో చివరి సంక్షోభ దశాబ్ది గ్రామీణ విధ్వంస గాథలు
- గంటేడ గౌరునాయుడు
తెలుగు కథకు నూరేళ్ళు. ఆధునిక రూప స్వభావాలతో గురజాడ దిద్దుబాటు దారిలో కథానిక ప్రయాణం అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉంది. తొలి కథ ఏది, తొలి ఆధునిక కథా రచయిత ఎవరు అన్న ప్రశ్నలకు ఎవరు ఎన్ని అనుకున్నా తొలి ఆధునిక కథ `దిద్దుబాటు', గురజాడ తొలి కథా రచయిత అని నా నిశ్చితాభిప్రాయం. గురజాడ ప్రచారకులే అధికారంలోకి వచ్చారు కాబట్టి వారి ప్రచారమే అధికారిక వాస్తవం అయ్యిందని, లేదంటే మాడపాటి హనుమంతరావు గారే తొలి కథా రచయిత అని కొందరంటారు (కొందరు బండారు అచ్చుమాంబ అంటారు).

పని కట్టుకొని ప్రచారం చేయాల్సిన అవసరం, `ప్రచారకులు'గా కొందరు తయారై గురజాడను తొలి రచయితగా ప్రచారం చేస్తే వచ్చే ప్రయోజనం ఎవరికయినా ఉంటుందని నేననుకోను. వాద వివాదాల మాట ఎలా ఉన్నా తొలి కథ `దిద్దుబాటు' అనుకుంటే, అప్పట్నుంచీ (1910) ఈ శతాబ్దకాలంలో వచ్చిన కథలను పది దశాబ్దాలుగా, దశాబ్దానికొక ఎంపిక చేసిన కథల సంపుటి- తెలుగు నేల సామాజిక పరిణామ వికాసాల గురించి తెలుసుకోవడానికి దోహదపడుతుంది. ఆయా దశాబ్దాలలోని జీవన స్థితిగతులు, విశేషాలు, ఉద్యమాలు, ఉద్వేగాలు స్పష్టంగా తెలుస్తాయి. ఈ మార్పులన్నింటిని పట్టిచ్చే ప్రక్రియ ఒక్క కథానిక మాత్రమే.

గత దశాబ్దకాలంలో తెలుగు నేలలో సంభవించిన సంక్షోభాలు, విచ్ఛిన్నమవుతున్న మానవ సంబంధాలు, గ్రామీణ జీవితం, రైతులు, రైతుల చుట్టూ అల్లుకొని ఉన్న వృత్తిపనివారు, స్త్రీ- దళిత- మైనార్టీల సమస్యలు.. ఇంకా అనేకాంశాల మీద వచ్చిన కథలు ఏడాదికి పదిహేను తీసుకున్నా పదేళ్ళకు నూట యాభై కథలు కనిపిస్తాయి. ఇలా గుర్తు చేసుకుంటే రైతు- వ్యవసాయం అంశంగా వచ్చిన కథలు ఓ ముప్పై, స్త్రీల సమస్యలు ప్రధానంగా వచ్చిన కథలు ఇరవై, ప్రపంచీకరణ అంశంగా వచ్చినవి ఓ ముప్పై , దళితవాదం అంశంగా వచ్చినవి ఓ పది.

ఈ కథలు చదివిన తరువాత నేను గ్రహించింది- తెలుగు నేల రైతు జీవితంలో జరిగిన విచ్ఛిన్నం, రైతుల కడగండ్లు, వ్యవసాయ సంక్షోభం, రైతుల వలసలు కారణంగా గ్రామాలు ఖాళీ కావడం, ప్రాంతీయ అసమానతల కారణంగా అంతర్గత వలసవాదం- ఈ పరిణామాలు గ్రామీణ జీవితాన్ని అల్లకల్లోలం చేశాయని, ఏ రైతూ సుఖంగాలేడని, వ్యవసాయం జూదంగా మారి పల్లెల్లో రైతన్నవాడే లేకుండా పోయాడని, మూటా ముల్లే కట్టి కూలీలుగా పట్నం దారి పట్టేడని ఈ కథలు మనకు చెబుతున్నాయి. `తలపాగా స్వగతం', `క్షతగాత్ర గానం', `వలస', `పాటల బండి', `ఒక రాత్రి- రెండు స్వప్నాలు', `నేల తిమ్మిరి', `వలస పక్షి', `భూమి పుండు', `అన్నంగుడ్డ', `ఆసరశాల', `తెల్ల దయ్యం' వంటి ఎన్నో కథలు ఛిద్రమైపోతున్న గ్రామీణజీవితాన్ని కళ్ళముందుంచుతాయి. రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర ఎక్కడైనా రైతు జీవితం ఒకటేనని, కన్నీటి కడగండ్ల బ్రతుకేనని ఆయా రచయితలు ఆ కథల్లో స్పష్టంచేస్తారు.

గిరిజన జీవితాలలోని అలజడి `గోర పిట్ట', `ఆర్తి', `కొండఫలం', `గాయం' వంటి కథల్లో మనకు కన్పిస్తుంది. స్త్రీల సమస్యలు ప్రధానంగా `మనువు', `రెక్కలున్న పిల్ల', `ఇదం శరీరం', `ఆవర్జా', `బీటెన్‌ ట్రాక్‌', `మంచుపూలవాన', `మురళీ వాళ్ళమ్మ', `సహాయం', `తోడికోడలు', `గజీతరాలు', `సాలభంజిక', `అపరిచిత ఆకాశం కింద', `మౌన ఘోష' కథల్లో ఆయా రచయిత(త్రు)లు సాధికారికంగా చెప్పగలిగారు. కొన్ని వందల ఏళ్ళగా నడుస్తున్న పురుష సాహిత్య ప్రపంచాన్ని స్త్రీవాదం తిరస్కరించి ఎన్నో కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తోంది.

భాషలోను, భావవ్యక్తీకరణలోను, నిర్మాణంలోను ఒక కొత్త శిల్పాన్ని స్త్రీవాదం ఏర్పాటు చేసుకుంది. కొన్ని కొత్త ప్రతిపాదనలు వారి కథల్లో చోటు చేసుకున్నాయి. కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థను తిరస్కరించడం, వివాహం అనే తంతు లేకుండా కుటుంబ చట్రంలో ఇమడకుండా స్త్రీ పురుషులు కలిసి ఉండటం వంటివి ఆ ప్రతిపాదనల్లో కొన్ని.కుటుంబం పట్ల, వివాహ వ్యవస్థ పట్ల సమానమైన, స్పష్టమైన భావాలు, దృఢమైన వ్యక్తిత్వం, సంస్కార చైతన్యము ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమయ్యే లివింగ్‌ టుగెదర్‌ కాపురం గురించి రాస్తే, కొత్తగా జీవితాల్లోకి అడుగుపెట్టేవారి మీద చూపే ప్రభావం గురించి ఆలోచించాలి. అయితే స్త్రీవాద కథ ఒక మూస ధోరణిలో పడకుండా చూడాల్సి ఉంది.

ఇక గ్లోబలైజేషన్‌ అంశం ప్రధానంగా వచ్చిన కథలు- భూమి రియల్‌ ఎస్టేట్‌గా మారిపోయిన క్రమం, కార్‌ రేస్‌ కోర్సులు, గోల్‌‌ఫ కోర్సులు, బయోటెక్నాలజీ పార్కులు, ఐటి పార్కులు- ఇలా వ్యవసాయేతర ప్రయోజనాల కోసం భూమిని వాడటం, ఇందులో భాగంగా రైతుల బ్రతుకుల్లో రేగిన అల్లకల్లోలం, సామాన్య జన జీవితంలో వచ్చిపడ్డ అలజడిని చిత్రించిన కథలు- `తలుపు', `అపచారం', `కప్పడాలు', `నిశ్శబ్ద విప్లవం', `ఖాదర్లేడు', `బతికి చెడ్డ దేశం', `న్యూ బాంబే టైలర్‌‌స', `గోరీమా', `ఆత్మహత్యల చెట్టు', `ఖాళీ', `గేటెడ్‌ కమ్యూనిటీ', `మాయ', `భూమి దుఃఖం', `నేల దిగిన ఊడ', `కలలు కాలుతున్న వాసన'- గ్లోబలైజేషన్‌ దుష్ఫలితాలను ఆవిష్కరించాయి. ఇక రాజ్య హింస, దళిత స్పృహ అంశాలుగా వచ్చిన కథలు నాకు దొరికినవి తక్కువే.

`సిగ్గు', `బఫెలోస్‌ క్లబ్‌', `భారతం బొమ్మలు', `మట్టి పక్షులు', `బైపాస్‌ రైడర్‌‌స', `జ్ఞాతం' దళిత స్పృహ కలిగిన కథలయితే, `వాళ్ళు', `పరమవీర చక్ర', `ప్రశ్న భూమి' రాజ్యహింసకు సంబంధించిన కొన్ని.ఆధునికత పేరుతో కొందరు చేసిన ప్రయోగాలు- అర్థరహితమైనవిగా, పాఠకుల్ని అస్పష్టతలోకి నెట్టివేసినవిగా కొన్ని కన్పిస్తాయి. కొన్ని జుగుప్సాకరంగా అన్పిస్తాయి. ఉదాహరణకు మేజిక్‌ రియలిజమ్‌ పేరుతో వచ్చిన కొన్ని కథలు. హిందూ ముస్లిం కుటుంబాల నడుమ సఖ్యత సామరస్యాలకు ప్రతిరూపంగా చిత్రించిన `అమ్మవారి నవ్వు', ముస్లిం కావటమే అనవసర ద్వేషానికి కారణం కాకూడదన్న `సారీ జాఫర్‌' వంటివే కాక, ముస్లిం కుటుంబాల జీవిత చిత్రణ కథలు, స్త్రీలు అనుభవించే హింస, మతాంతర ప్రేమ వివాహాల గురించి చెప్పే కథలు వచ్చేయి.

పదేళ్ళ మార్పులను గమనిస్తే మారుతున్న వాతావరణం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సమాజంలో అన్నిరంగాలలోని సంక్షోభం కథలలో ప్రతిఫలిం చింది. భూమి విలువలో వచ్చిన మార్పు- దాని చుట్టూ అల్లుకున్న మాయ విలువలు, చిన్న వయసులోనే పెద్ద పెద్ద జీతాలు అందించే ఐటిరంగం, పెరిగిపోతున్న అంతరాలు, పట్టణ జీవితాల్ని, గ్రామీణ జీవితాల్ని అతలాకుతలం చేస్తున్నాయని ఈ కథలు చెబుతున్నాయి. మానవ సంబంధాల విచ్ఛిన్నతను చూపెడుతున్నాయి. రానున్న ఉత్పాతాలను పసిగట్టి హెచ్చరిస్తున్నాయి. అయితే కథా రచనలో రచయితలకు వస్తువుపట్ల ఉన్న శ్రద్ధ శిల్పం పట్ల లేకపోయిందేమోనని అన్పిస్తుంది.

ప్రపంచీకరణ దుష్ఫలితాలు మనిషిజీవితంలో ఇంకిపోయి, సమాజం ఛిన్నాభిన్నం అయిపోయే దుస్థితిని కథల్లో ఆవిష్కరించి, కథని కళాత్మకంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యతను కథా రచయితలు గుర్తించాలి. మొత్తం మీద తెలుగు నేల మీద జరుగుతున్న పరిణామ క్రమాన్ని ఆవిష్కరించడంలో కథ ఏ మాత్రం వెనుకబడి లేదని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. తెలుగు కథ నూరేళ్ళ పండుగను గర్వంగా జరుపుకోవచ్చని కథానిక భరోసా ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది.

కథల ఎడారి కోస్తా!
-పెద్దిభొట్ల సుబ్బరామయ్య
ఒక శతాబ్దపు తెలుగు కథానిక వైభవం గురించి మాట్లాడుకోవలసిన శుభ సందర్భం ఇది. మొదటి కథానిక గురజాడది అయినా మరొకరిది అయినా మొత్తానికి నూరేళ్ళ మహోజ్వల వైభవోపేత చరిత్ర ఉంది మన కథానికకు. సుదీర్ఘమూ సుసంపన్నమూ అయిన ఆ చరిత్ర అంతానూ ఆ మహా రచయితల కంట్రిబ్యూషన్‌ అంటూ చెప్పుకుంటూ పోవడం ఈ సంవత్సరం పొడవునా సాహిత్య ప్రేమికులు చేస్తూనే ఉంటారు. నిజానికి తొంభై ఏళ్ళ చరిత్ర ఒక ఎత్తు అయితే గత దశాబ్దపు చరిత్ర మరో ఎత్తు అని చెప్పాలి.
తొంభై దశకం నుంచి తెలుగు కథానిక రూపు రేఖలు గణనీయంగా మార్పు చెందాయి. నేడు తెలుగు సాహిత్య ప్రపంచాన్ని తెలుగు `కథానిక' పరిపాలిస్తున్నదని చెప్పవచ్చు. అంతకు ముందు పాఠక లోకాన్ని అలరించిన కేవల కాలక్షేపపు కథలు, కొసమెరుపు కథలు, బావా మరదళ్ళ కథలు, వ్యర్థ ప్రణయ హాస్య కథలు- వీటికి కాలం చెల్లింది.

ఈ దశకంలో కళింగాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలనుంచి రాశిలోను వాసిలోను అత్యంత పాఠకామోదం పొందిన, విమర్శకుల మెప్పు పొందిన కథలు పుష్కలంగా వెలువడ్డాయి.
నేటి కాలపు పెను సమస్యల పైన మన సమాజ స్థితి గతులను అతలాకుతలం చేస్తున్న వివిధ పరిణామాలను గురించీ మన రచయితలు ఆందోళన చెందుతున్నారు. గ్లోబలీకరణ, పారిశ్రామికీకరణ, ప్రైవేటీకరణలతో సున్నిత మానవ సంబంధాలు కూడా ధ్వంసమైపోతున్న వైనాన్ని రచయితలు గమనిస్తున్నారు. ముఖ్యంగా పై మూడు ప్రాంతాలనుంచి ఈ దారుణ పరిణామాల వల్ల లుప్తమై పోతున్న మానవీయ విలువలు, తరిగిపోతున్న అనుబంధాలు, మనిషికి నేలతో భూమితో ఉండవలసిన సున్నిత క్రమ సూత్రం తెగిపోతున్న వైనం మన రచయితలను కలవరపరుస్తున్నాయి.

పల్లెలు, పల్లె జీవితం నశించి పోతున్న వైనం, కుల వృత్తులు ధ్వంసమై యువత అయోమయ స్థితి నెదుర్కొంటున్న వైనం మన రచయితలు అతి శ్రద్ధగా గమనించి ఆ దుష్ట ఫలితాలను చిత్రిస్తున్నారు. ఆర్థిక సంస్కరణల పేరుతో మన ప్రభుత్వాలు పరాయీకరణను చేపట్టి యువతను ఎలా పెడ మార్గాలు పట్టిపోయేట్టు చేస్తున్నాయో చిత్రిస్తున్నారు. డాలర్ల మీది మోజుతో ఆ చదువులే చదివి డాలర్ల రుచి మరిగి డాలరు సుఖాలు మరిగి మన యువత మన సమాజానికి పనికి రాకుండా అమెరికా దాస్యం ఎలా చేస్తున్నారో అనేక రకాలుగా చిత్రిస్తున్నారు. కార్పొరేట్‌ కల్చర్‌ విస్తరించిన కోస్తా ప్రాంతాలనుంచి బలమైన సామాజిక ముద్రతో అధిక సంఖ్యలో కథలు వెలువడకపోవడం గమనార్హం. ఈ కోస్తా ప్రాంతపు ధనబలంతో కార్పొరేట్‌ వైద్యశాలలు, కార్పొరేట్‌ కాలేజీలు, కేవల సినిమా టివి వ్యర్థపదార్ధాలు మాత్రం పుష్కలంగా తయారై దేశమంతటిలోని యువతను పెడమార్గాలు పట్టించడం మాత్రం జరుగుతున్నది.

సినిమా, టివి, ముద్రణ రంగాలలో ఆరితేరినవారు, ప్రథమగణ్యులు ఇక్కడివారే. వీరి చలవ వల్ల వైడ్‌ స్క్రీన్‌, బుల్లి స్క్రీన్‌లలోనూ పత్రికలలోనూ ఎటువంటి బీభత్సం జరుగుతున్నదో, బాధ్యత తెలిసి బుద్ధిగా ఉండవలసిన యువలోకం ఎటువంటి దుర్మార్గపు పోకడలు పోతున్నదో చూస్తూనే ఉన్నాము.
తెలంగాణ, సీమ, కళింగాంధ్ర ప్రాంతాలలో జనజీవితం అస్తవ్యస్తమై పోతున్న వైనం, భూమితో మానవుల సంబంధాలు తెగిపోతున్న వైనం కథల రూపంలో మన రచయితలు రికార్డు చేస్తున్నారు.

(సూర్య తెలుగు దినపత్రిక సౌజన్యంతో)

No comments:

Post a Comment